అక్కినేని కుటుంబానికి కొండా సురేఖ తక్షణమే క్షమాపణ చెప్పాలి
అక్కినేని అభిమానుల సంఘం రాయలసీమ జిల్లాల కార్యదర్శి వెల్దుర్తి షేక్ ఉస్మాన్ భాష
కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, అక్టోబర్ 04, (కర్నూలు ప్రభ న్యూస్) :
అక్కినేని కుటుంబానికి మంత్రి కొండా సురేఖ తక్షణమే క్షమాపణ చెప్పాలని అక్కినేని అభిమానుల సంఘం రాయలసీమ జిల్లాల కార్యదర్శి వెల్దుర్తి షేక్ ఉస్మాన్ భాష డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా ఒడిలో ఎదిగాడు అనే కంటే,తెలుగు సినిమానే ఆయన వల్ల ఎదిగిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందే 1942 లో ధర్మపత్ని అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అక్కినేని దాదాపు రెండు వందల యాభై ఐదు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి కోట్లాది మంది అభిమానులని సంపాదించాడు ఆయన అన్నారు.స్టూడియో అధినేతగా,నిర్మాతగా కూడా విశేష సేవలు అందించడంతో పాటు పద్మశ్రీ,పద్మ భూషణ్,పద్మ విభూషణ్,దాదాసాహెబ్ ఫాల్కే, లాంటి ప్రతిష్టాత్మక అవార్డుల ని పొంది తెలుగు సినిమా కీర్తిని కూడా పెంపొందించాడు. నాగార్జున,నాగ చైతన్య,అఖిల్,సుమంత్,సుశాంత్,సుప్రియ వంటి తారల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి కళామతల్లి రుణం కూడా తీర్చుకున్నాడు. అలాంటి మహోన్నత వ్యక్తి కుటుంబం మీద తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన నిరాయుధమైన వ్యాఖ్యలతో అక్కినేని ఆత్మ క్షోభిస్తుందనే మాటని ప్రతి ఒక్కరు వ్యక్త పరుస్తున్నారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలని ఖండిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అక్కినేని అభిమానులు తక్షణమే కొండా సురేఖ దంపతులు అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అక్కినేని అభిమానుల సంఘం సభ్యులు ఈశ్వర్, మహేష్, యస్ యం భాష, వెంకటేష్,చలపతి,అనిల్ గౌరీ శంకర్ రవి తదితరులు పాల్గొన్నారు.