కార్మిక చట్టాల రక్షణకు పోరాటానికి సిద్ధం కావాలి
1 min read
కార్మిక చట్టాల రక్షణకు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి
ప్యాపిలి, మార్చి 29, (కర్నూలు ప్రభ న్యూస్) :
బ్రిటిష్ నాటి కాలంలో పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు చుట్టాలుగా చేసి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని కార్మిక చట్టాల పరిరక్షణకు రాబోయే రోజుల్లో మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెలపర్స్ అసోషియోషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుణమ్మ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ లు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళవారం ప్యాపలి పట్టణం లో స్థానిక సీపీఐ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి అనంతరం పాత బస్ స్టాండ్ నందు బహిరంగ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కష్టించి శ్రమ చేసి సంపాదించిన ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు అన్నారు. కార్మికులు కష్టించి శ్రమతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరుతో ఆదాన్ని, అంబానీలకు తాకట్టు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. నరేంద్ర మోడీ పరిపాలన మరో బ్రిటిష్ కాలం పరిపాలన లాగా ఉంది అన్నారు. కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కరువైందని కనీస వేతనాలకు దూరంగా పని చేస్తున్నారన్నారు. పనిగంటల పెంపును దేశ కార్మికవర్గం వ్యతిరేకిస్తున్న మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం సిగ్గుచేటైన విషయం అన్నారు. స్కీం కార్మికులకు,ఔట్ సోర్సింగ్, అసంఘటిత రంగ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి, కనీస వేతనం 26,000 అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు పరిరక్షణకై పోరాడాలని అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించ రాదని జగనన్న గోరుముద్ద మెస్చార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. ఏఐటీయూసీ డోన్ నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్ సిపిఐ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసులు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు అరుణ తదితరులు పాల్గొన్నారు.