September 18, 2024

స్త్రీ జాతి వెలుగు దివ్వె శ్రీమతి సావిత్రి బాయి ఫూలే

స్త్రీ జాతి వెలుగు దివ్వె శ్రీమతి సావిత్రి బాయి ఫూలే

ప్యాపిలి, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :

భారత దేశపు తొలి ఉపాధ్యాయినిగా,సామాజిక విప్లవకారిణిగా,చరిత్రలో చిరస్మరణీయ స్థానం పొందిన మహోన్నత మహిళ,రచయిత, సంఘ సంస్కర్త,మహిళా ఉద్యమ గొంతుక,ఆధునిక మహిళా చరిత్రను తిరగరాసిన స్త్రీ జాతి వెలుగు దివ్వె శ్రీమతి సావిత్రి బాయి ఫూలే అని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పేర్కొన్నారు. సావిత్రి బాయి ఫూలే గారి వర్ధంతి సందర్భంగా పి ఆర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పాఠశాల అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్పన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే పేరు పొందారని,1831 జనవరి 3 న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో ఆమె జన్మించిందని,ఆమె తన తొమ్మిదవ ఏటనే పన్నెండేళ్ళ జ్యోతిరావు పూలేతో 1840 లో వివాహం జరిగిందని నిరక్షరాస్యులైన ఆమె, భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో, వారి వద్దనే విద్యనభ్యసించి, విద్యా వంతురాలు అయిందని తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848 జనవరి 1 న భర్త జ్యోతిబాపూలే తో కలిసి అణిచివేతకు గురైన కులాల బాలికల కోసం పూణేలో సావిత్రిబాయి మొదటి పాఠశాలను ప్రారంభించిందని అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద లాంటి సమస్త హక్కులు నిరాకరించబడిన సమాజంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఎదిరించి,విధి నిర్వహణ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచి,గెలిచారని గుర్తు చేశారు.కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆమె వయస్సు కేవలం 18 ఏళ్లు మాత్రమే అని జీవితకాలం మొత్తంలో 52 పాఠశాలను ప్రారంభించారని అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య భావజాలం గల వారి నుండి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్నదని ఆనాటి సాంఘిక పరిస్థితులు వివరించారు. ఈ నేపథ్యంలో చివరికి 1849లో భర్త తో కలిసి గృహ బహిష్కరణ కు గురి కావలసి వచ్చిందని స్త్రీ, పురుషులు కుల మతాలకతీతంగా విద్య నభ్యసించడం సహజమైన హక్కు అని, అందుకే అందరూ చదవాలి – అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మూర్తి సావిత్రి బాయి అని కొనియాడారు. మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన గొప్ప విప్లవ వనిత సావిత్రిబాయి పూలే అని,1873లో తన భర్త జ్యోతిబాపూలే తో కలిసి సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా,వితంతు పునర్వివాహాల కొరకు బలమైన ఉద్యమం నడిపారని పేర్కొన్నారు. 1890లో భర్త జ్యోతిరావ్ పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే సనాతన ఆచారాలకు విరుద్ధంగా తానే ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు చేసి,అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణవాదిగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.క్రాంతి బాయి గా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటారని,1897 లో ఆమె వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్న క్రమంలో పాండురంగ గైక్వాడ్ కొడుకు ప్లేగు వ్యాధి బారిన పడటం గమనించి, ఆసుపత్రికి తీసుకు వచ్చే క్రమంలో, ఎవరూ లేక స్వయంగా తానే తన 66వ ఏట భుజంపై ఆ బాలుడిని వేసుకొని, ఆసుపత్రికి తీసుకు వస్తున్న సందర్భంలో ఆ బాలుడి శ్వాస ఆమె పీల్చడంవల్ల తాను కూడ వ్యాధిబారిన పడిందని అయితే ఆ బాలుడు బ్రతికాడు కాని, ఆమె 1897 మార్చి 10 న
మరణించిందని తెలిపారు.ఆమె చేసిన సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమె పుట్టిన రోజైన జనవరి 3 వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అనంతరం సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ చంద్ర మోహన్,రాజ కుళ్లాయప్ప, ఖాజాబి, చాముండేశ్వరి, కృష్ణ, వెంకటేశ్వర్లు, రమణారావు, మహేశ్వరి, శ్రీనివాసులు,సరోజ,పరమేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS | Newsphere by AF themes.
error: Content is protected !!