క్లాప్ (క్లీన్ నంద్యాల) అమలుకు ప్రతి ఒక్కరు సహకరించాలి
1 min read
క్లాప్ (క్లీన్ నంద్యాల) అమలుకు ప్రతి ఒక్కరు సహకరించాలి
– మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ
కంపోస్ట్ యార్డు ని పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ
నంద్యాల ప్రతినిధి, మార్చి 10, (కర్నూలు ప్రభ న్యూస్) :
క్లాప్ (క్లీన్ నంద్యాల) అమలుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ కోరారు. పట్టణంలోని భీమవరం రహదారిలో ఉన్న కంపోస్ట్ యార్డులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఏర్పాటు చేసిందని, ఇటీవలే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోటేశ్వర రావు, మున్సిపల్ చైర్మన్ మాబున్నీసాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందుకోసం నంద్యాలలో 37 ఆటోలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించి ఉచితంగా 3 చెత్త బుట్టలను ఇవ్వడం జరిగిందన్నారు. గ్రీన్ డబ్బాలో తడిచెత్త, బ్లూ డబ్బాలో పొడిచెత్త, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటే బ్లాక్ డబ్బా, హానికర పదార్థాలను (డైపర్స్, శానిటరీ నాప్కిన్స్ తదితర వాటిని) రెడ్ డబ్బాలో వేయాలన్నారు. కంపోస్టు యార్డులో తడిచెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఏర్పాటు చేస్తున్నామని, గత 15 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు బాగా సహకరిస్తున్నారని తెలిపారు. తడి చెత్తను కుల్లిపోయే విధంగా చేస్తామని, పొడి చెత్తను విడివిడిగా చేస్తామన్నారు. పర్యావరణానికి హాని లేకుండా కార్యక్రమం ఉందన్నారు. ప్రతి ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. తాము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు. యూజర్ ఫీజులు ప్రజల నుండి వసూలు చేస్తున్నామని, 30, 60 రూపాయలు వసూలు చేస్తున్నామని, పట్టణ ప్రజలు బాగా సహకరిస్తున్నారని, 100 శాతం యూజర్ ఫీ వసూలు అవుతుందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం “‘మన చెత్త-మన బాధ్యత,”” “”మన పట్టణం-మన గౌరవం”” అనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్ వైజర్ రంగయ్య .మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.